CJI Justice Surya Kant : హైకోర్టు జోన్-2 భవనాలకు శంకుస్థాపన: న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మౌలిక సదుపాయాలు అత్యవసరం - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌

న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మౌలిక సదుపాయాలు అత్యవసరం - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌

Update: 2026-04-06 05:06 GMT

CJI Justice Surya Kant : న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మౌలిక వసతులు ఐచ్ఛికం కాదు, అత్యవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. చెల్లాచెదురుగా, ఇరుకైన భవనాల్లో హైకోర్టు నిర్వహణ ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కొత్త హైకోర్టు సముదాయం పూర్తి చేస్తే అన్ని కార్యకలాపాలు ఒకేచోట సమగ్రంగా నిర్వహించవచ్చని తెలిపారు. కోర్టు హాళ్లు, కార్యాలయాలు, న్యాయమూర్తుల నివాసాలు, శిక్షణా కేంద్రాలు అన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడం ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తయ్యాక ఈ సముదాయం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. 2027 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌ ప్రాంతంలో ఆదివారం (ఏప్రిల్ 5, 2026) నూతన హైకోర్టు ప్రాంగణంలో జోన్‌-2 కింద న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణానికి సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సీజేఐ మాట్లాడుతూ ‘‘న్యాయవ్యవస్థ స్వతంత్రతపై తీర్పులు, సమావేశాలు, రాజ్యాంగ చర్చల్లో తరచూ చర్చిస్తుంటాం. కానీ ఈ వ్యవస్థ స్వతంత్రతకు మౌలిక సౌకర్యాలు చాలా కీలకం’’ అని అన్నారు. కొత్త హైకోర్టు కాంప్లెక్స్‌ను ‘పౌరులందరికీ ఆలయం’లాగా భావించాలని వ్యాఖ్యానించారు. జోన్-1 పనులు వేగంగా కొనసాగుతున్నాయని, జోన్-2లో న్యాయమూర్తుల నివాసాల నిర్మాణం ఇప్పుడు ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మొత్తం ప్రాజెక్టు 2027 డిసెంబరులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కొత్త సముదాయం ద్వారా న్యాయపరమైన కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా, సౌకర్యవంతంగా నిర్వహించవచ్చని అధికారులు వివరించారు. రాజేంద్రనగర్‌లోని ఈ ప్రాజెక్టు తెలంగాణ న్యాయవ్యవస్థ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News