Seethakka: అంగన్వాడీల బలోపేతంపై సీతక్క సమీక్ష.. మౌలిక వసతులు, నియామకాలపై కీలక ఆదేశాలు
నియామకాలపై కీలక ఆదేశాలు
Seethakka: అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనిఫార్మ్‌లను అక్టోబర్ మొదటి వారంలోగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 అడాప్షన్ సెంటర్లు ఉన్నాయని అధికారులు వివరించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే 16 జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ కాగా మిగిలిన జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పోషకాహారం, ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు లాప్స్ కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.