Union Cabinet Decision: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు
Union Cabinet Decision: కేంద్ర కేబినెట్ మెడికల్ విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) ఫేజ్-3 కింద ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్లు, 5,023 అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
2025-26 నుంచి 2028-29 వరకు ఈ సీట్ల పెంపు అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కోసం రూ.15,034 కోట్లు కేటాయించగా, ఇందులో కేంద్రం రూ.10,303 కోట్లు, రాష్ట్రాలు రూ.4,731 కోట్లు భరిస్తాయి. ఒక్కో సీటుకు సుమారు రూ.1.5 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ అనుమతించింది. త్వరలో ఈ సీట్ల పెంపుపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 808 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,23,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. గత దశాబ్దంలో 69,000కు పైగా మెడికల్ సీట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త నిర్ణయంతో మెడికల్ విద్యా సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి.