External Affairs Ministry Clarifies: 2025లో మోడీ-ట్రంప్ ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడారు: విదేశాంగ శాఖ స్పష్టీకరణ

విదేశాంగ శాఖ స్పష్టీకరణ

Update: 2026-01-09 15:44 GMT

External Affairs Ministry Clarifies: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా సంభాషించకపోవడమే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆలస్యానికి కారణమని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్ర స్పందన వ్యక్తం చేసింది. 2025లో వివిధ అంశాలపై మోడీ-ట్రంప్ ఎనిమిది సార్లు ఫోన్‌లో సంభాషించారని, ఆ వ్యాఖ్యలు సరికావని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

గతేడాది ఫిబ్రవరి 13 నాటికే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై కట్టుబాటు ప్రకటించాయని, అప్పటి నుంచి పలుమార్లు చర్చలు జరిగాయని జైస్వాల్ గుర్తు చేశారు. ‘‘అమెరికా మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదు. అనేకసార్లు ఒప్పందం దగ్గరగా వచ్చింది. ఇప్పటికీ ముందుకు సాగేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. 2025లో ఎనిమిది సందర్భాల్లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇక రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన అదనపు ఆంక్షల బిల్లు (500 శాతం సుంకాలు) గురించి తమకు పూర్తి అవగాహన ఉందని, పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ ఇంధన భద్రతను కాపాడటమే ప్రాధాన్యత అని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టీకరించింది.

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను కూడా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. వరుస దాడులు ఆపాలని, వాటిని వ్యక్తిగత లేదా రాజకీయ వివాదాలుగా కొట్టిపారేయడం సరికాదని హెచ్చరించింది. అలా చేస్తే నేరస్థులు మరింత రెచ్చిపోతారని, మైనార్టీల్లో భయం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News