రీసైక్లింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియలో NFTDC కీలకం
చంద్రయాన్, మంగళ్‌యాన్, గగన్‌యాన్ ప్రయోగాల్లో NFTDC;
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని నాన్-ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (NFTDC)ను సందర్శించి, సంస్థ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాల గురిచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సంస్థకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు శ్రీ బీకే రావ, డాక్టర్ పి.రామారావు, డాక్టర్ వి. అరుణాచలం వంటి మహనీయుల మార్గదర్శనం దొరికిందన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మెరుగుపరుచుకుంటూ.. దేశ రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఈవీ,వైద్య, అంతరిక్ష తదితర రంగాల్లో ఈ సంస్థ కీలకమైన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ఇస్రో ఆధ్వర్యంలో జరుగుతున్న చంద్రయాన్, మంగళ్‌యాన్, గగన్‌యాన్ వంటి ప్రయోగాల్లో అవసరమైన సూపర్ స్పెషాలిటీ మెటీరియల్ ఈ కేంద్రం ద్వారా అందాయని కేంద్రమంత్రి గుర్తుచేశారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిన సందర్భంలో.. మినరల్స్ రీసైక్లింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియకు ఈ కేంద్రం ఎంతో కీలకంగా మారుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సాంకేతికతను వృద్ధి చేయడంతోపాటుగా.. దీన్ని ప్రయివేటు రంగంతో పంచుకుని.. ఈ రంగంలో మరింత ప్రగతి సాధించేందుకు NFTDC తీసుకుంటున్న చొరవను కేంద్రమంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళ్లాలని ఏమైనా సమస్యలుంటే తనకు చెబితే.. దీన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు. క్రిటికల్ మినరల్ రంగంలో గ్లోబల్ సప్లయ్ చైన్స్ విషయంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో.. NFTDC ద్వారా జరుగుతున్న ప్రయత్నం భారతదేశాన్ని క్రిటికల్ మినరల్స్ రంగంలో ఆత్మనిర్బరత దిశగా నడిపిస్తోందన్నారు. అడ్వాన్స్‌డ్ మ్యాగ్నెట్స్, స్ట్రాటజిక్ మెటీరియల్స్ టెక్నాలజీస్ విషయంలో అంతర్జాతీయ కేంద్రంగా ఈ సంస్థ ఖ్యాతి గడించాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.