Rajasthan: రాజస్థాన్: భార్య పేరుతో మోసపూరిత ఉద్యోగాలు.. పని లేకుండానే రూ. 37 లక్షలు సంపాదించిన అధికారి!

పని లేకుండానే రూ. 37 లక్షలు సంపాదించిన అధికారి!

Update: 2025-10-27 14:23 GMT

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ అవినీతి ఘటన బయటపడింది. ప్రభుత్వ అధికారి తన భార్య పేరుతో రెండు ప్రైవేట్ సంస్థల్లో తప్పుడు ఉద్యోగాలు సృష్టించి, ఆమెకు పని చేయకుండానే లక్షలాది రూపాయల వేతనం చెల్లించించాడు. రాజ్‌కాంప్ ఇన్ఫో సర్వీసెస్‌లో ఐటీ విభాగ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమ్నా దీక్షిత్.. తన భార్య పూనమ్ దీక్షిత్‌ను 'ఫేక్' ఉద్యోగిగా చూపించి, మొత్తం రూ. 37 లక్షలు స్వాధీనం చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసానికి సంబంధించిన పిటిషన్ రాజస్థాన్ హైకోర్టులో దాఖలైంది.

ప్రభుత్వ టెండర్లు ముట్టజెప్పడానికి గాను ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని ఈ అధికారి, ఓరియన్ ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ వంటి సంస్థలకు అవకాశాలు కల్పించాడు. మార్గదర్శకాల ప్రకారం, టెండర్లు పొందాలంటే ప్రద్యుమ్నా భార్యను ఆ సంస్థల్లో ఉద్యోగిగా నియమించాలనే షరతు వేశాడట. దీనికి అంగీకరించిన కంపెనీలు, పూనమ్‌ను 'పని చేస్తున్న'ట్టు తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేశాయి. ఫలితంగా, 2019 సెప్టెంబర్ నుంచి 2020 వరకు రెండేళ్ల పాటు ఆమెకు నెలవారీ వేతనాలు చెల్లించబడ్డాయి.

దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, పూనమ్‌కు చెందిన ఐదు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ. 37 లక్షలు బదిలీ అయ్యాయి. అయితే, ఈ కాలంలో ఆమె ఒక్క రోజు కూడా ఆ కంపెనీలకు హాజరు కాలేదని, పూర్తిగా 'ఫేక్' హాజరు రిపోర్టులు మాత్రమే సృష్టించబడ్డాయని అధికారులు ధృవీకరించారు. ఈ నకిలీ రికార్డులకు ప్రద్యుమ్నా స్వయంగా సంతకాలు చేసి, ఆమోదం తెలిపినట్టు తేలింది.

ఈ ఆరోపణలపై హైకోర్టు, అవినీతి నిరోధక బ్యూరో (ACB)కు దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. జులై 3, 2025 నుంచి విచారణ జరుగుతోంది. ఈ ఘటన ప్రభుత్వ టెండర్ విభాగంలోని అవినీతి మూలాలను బయటపెట్టినట్టుగా ఉంది.

Tags:    

Similar News