NimishaPriya’s Death Sentence: నిమిష ప్రియ మరణశిక్షపై స్టే కొనసాగుతోంది: కేంద్రం సుప్రీంకోర్టుకు సమాచారం
కేంద్రం సుప్రీంకోర్టుకు సమాచారం
NimishaPriya’s Death Sentence: యెమెన్‌లో భారత నర్సు నిమిష ప్రియ మరణశిక్షను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ శిక్ష అమలుపై ప్రస్తుతం స్టే కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకోలేదని కూడా వెల్లడించింది.
నిమిష ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. తాజా విచారణలో కోర్టు ఈ మరణశిక్ష గురించి ప్రశ్నించగా, ‘సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ తరఫు న్యాయవాది శిక్ష అమలుపై స్టే కొనసాగుతోందని తెలిపారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి మాట్లాడుతూ, “ఈ కేసులో కొత్త మధ్యవర్తి ప్రవేశించారు. ఇప్పటివరకు సానుకూల విషయం ఏంటంటే, ఎలాంటి తీవ్ర పరిణామాలు జరగలేదు” అని వివరించారు. ఈ వాదనలను విన్న సుప్రీంకోర్టు కేసు విచారణను జనవరికి వాయిదా వేసింది. అయితే, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందస్తు విచారణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
నిమిష ప్రియ 2008లో నర్సింగ్ కోర్సు పూర్తిచేసి యెమెన్‌లో ఉద్యోగంలో చేరారు. అక్కడి నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి తలాల్ అదిబ్ మెహదితో కలిసి అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను స్థాపించారు. అయితే, తలాల్ ఆమెను వేధించి, ఆమె పాస్‌పోర్ట్‌తో సహా ముఖ్యమైన పత్రాలను లాక్కున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 2016లో నిమిష ప్రియ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 2017లో తన పాస్‌పోర్ట్ తిరిగి పొందేందుకు తలాల్‌కు మత్తుమందు ఇచ్చింది. కానీ, ఆ మోతాదు ఎక్కువ కావడంతో అతడు మరణించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. సౌదీ అరేబియాకు పారిపోయే ప్రయత్నంలో సరిహద్దులో ఆమెను అరెస్టు చేసి, మరణశిక్ష విధించారు. భారత ప్రభుత్వం, మత పెద్దల సహకారంతో ప్రస్తుతానికి ఈ శిక్ష అమలు వాయిదా పడింది.