Supreme Court Orders: విగ్రహాల నిర్మాణానికి ప్రజాధనం వాడొద్దు: సుప్రీంకోర్టు ఆదేశం
ప్రజాధనం వాడొద్దు: సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court Orders: తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. విగ్రహాల నిర్మాణానికి ప్రజల డబ్బును ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ కూరగాయల మార్కెట్ వద్ద దివంగత నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటు చేయడానికి సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ప్రతిపాదనను మద్రాస్ హైకోర్టు వ్యతిరేకించింది. పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని, అవి ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. "మాజీ నాయకులను సన్మానించడానికి ప్రజా ధనాన్ని ఎందుకు వాడుతారు? ఇది అనుమతించబడదు" అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఊరట కావాలనుకుంటే, హైకోర్టును మళ్లీ ఆశ్రయించాలని సూచించారు.
ఈ తీర్పు ప్రజాధనం దుర్వినియోగాన్ని నిరోధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.