Bastar IG Sundarraj: లొంగిపో హిడ్మా.. లేదంటే మృతి తప్పదు: బస్తర్ ఐజీ సుందర్ రాజ్ గట్టి హెచ్చరిక
బస్తర్ ఐజీ సుందర్ రాజ్ గట్టి హెచ్చరిక
Bastar IG Sundarraj: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడవి హిడ్మాను పట్టుకునేందుకు కేంద్ర హోం శాఖ, చత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ హిడ్మా’ పేరిట ప్రత్యేక బలగాలను రంగంలోకి దించాయి. “హిడ్మా మా రాడార్ పరిధిలో ఉన్నాడు. లొంగిపో.. లేకపోతే చచ్చిపోతావ్” అంటూ బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా, 1996-97లో 17 ఏళ్ల వయసులో పీపుల్స్ వార్ పార్టీలో చేరి, అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా స్థానం పొందాడు. 2010లో తాడిమెట్లలో 76 మంది జవాన్లను హతమార్చిన దాడిలో హిడ్మానే కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి అతన్ని పట్టుకునేందుకు పలు ఆపరేషన్లు జరిగినప్పటికీ, నిఘా వర్గాల వద్ద అతని పాత ఫొటో మాత్రమే ఉండటంతో అతన్ని గుర్తించడం కష్టమైంది.
ఇటీవల కొంతమంది మావోయిస్టులు లొంగడంతో, హిడ్మా తాజా ఫొటోను భద్రతా బలగాలు సంపాదించాయి. దీంతో కేంద్ర, చత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ విభాగాలు ‘ఆపరేషన్ హిడ్మా’ను మరింత ఉద్ధృతం చేశాయి. ఈ ఆపరేషన్ ద్వారా హిడ్మాను పట్టుకునేందుకు లేదా లొంగిపోయేలా చేయడానికి భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.