Terror Doctor’s Faridabad Home Turns Out to Be a Bomb Lab: టెర్రర్ డాక్టర్ ఫరీదాబాద్ ఇంట్లోనే బాంబు ల్యాబ్.. ముజమ్మిల్ ఇంప్రోవైజ్డ్ టెక్నిక్ షాక్!

ముజమ్మిల్ ఇంప్రోవైజ్డ్ టెక్నిక్ షాక్!

Update: 2025-11-21 11:54 GMT

Terror Doctor’s Faridabad Home Turns Out to Be a Bomb Lab: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనీ (35, పుల్వామా నివాసి) హర్యానాలోని ఫరీదాబాద్‌లో అద్దెకు తీసుకున్న ఇంట్లో సాధారణ పిండి గిర్నీని బాంబు తయారీ ఫ్యాక్టరీగా మార్చాడు. ఈ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మిక్సర్ గ్రైండర్, ఎలక్ట్రిక్ మెల్టింగ్ మెషిన్ మొదటి ఫొటోలు ఇప్పుడు బయటపడ్డాయి.

ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది ఏమిటంటే.. ముజమ్మిల్ ఈ పిండి గిర్నీలోని పెద్ద రోలర్లు, బ్లేడ్‌లతో అమ్మోనియం నైట్రేట్, యూరియా వంటి రసాయనాలను గ్రైండ్ చేసి పేలుడ పదార్ధాలను సిద్ధం చేసేవాడు. సాధారణంగా ధాన్యాలు, మసాలాలు గ్రైండ్ చేసే ఈ యంత్రాలనే ఉగ్రవాది ముజమ్మిల్ డేంజరస్ కెమికల్స్ ప్రాసెస్ చేయడానికి ఉపయోగించాడు. ఫరీదాబాద్‌లోని ధోజ్ ప్రాంతంలో ట్యాక్సీ డ్రైవర్ ఇంటి నుంచి ఈ యంత్రాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ముజమ్మిల్ నెలకు కేవలం రూ.1500 అద్దెకు గది తీసుకొని రెండేళ్లుగా ఉగ్ర కుట్రలు ప్లాన్ చేస్తూ వచ్చాడు. అల్ ఫలా యూనివర్శిటీలో డాక్టర్‌గా, ఎంబీబీఎస్ లెక్చరర్‌గా పనిచేస్తూ "వైట్ కాలర్ టెర్రరిజం" నడిపించాడు. ఇప్పటికే అతని గదుల నుంచి 2600 నుంచి 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, టైమర్లు, బ్యాటరీలు, రిమోట్ కంట్రోల్స్ స్వాధీనమయ్యాయి.

డైరీల్లో 2530 మంది పేర్లు.. కోడెడ్ సంకేతాలు

ముజమ్మిల్ డైరీలు, నోట్‌బుక్‌లలో "ఆపరేషన్" అనే పదం పదేపదే రాసి ఉంది. కోడెడ్ రిఫరెన్స్‌లు, నంబర్లు, 2530 మంది పేర్లు లభ్యమయ్యాయి. వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ సమీప ప్రాంతాలకు చెందినవారు. ఈ మాడ్యూల్‌లో మరో ఐదుగురు డాక్టర్లు (డాక్టర్ ఉమర్ నబీ, అదీల్, షాహీన్ సయీద్ తదితరులు) భాగస్వాములుగా ఉన్నారు. వీరంతా జైష్-ఇ-మొహమ్మద్ లింకులతో దేశవ్యాప్త పేలుళ్లకు ప్లాన్ వేశారు.

ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ యంత్రాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు? పాకిస్తాన్ హ్యాండ్లర్లతో ఎలా సంప్రదింపులు జరిపాడు? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఢిల్లీ పేలుడుతో ఈ మాడ్యూల్‌కు డైరెక్ట్ లింక్ ఉందని అధికారులు నిర్ధారించారు.

Tags:    

Similar News