ఎంపీలు, సీఎంలందరికీ ఆ పాపం చుట్టుకుంటుంది - రాజాసింగ్ సంచలన కామెంట్స్
That sin can surrounds all MPs and CMs - Raja Singh's sensational comments
బక్రీద్ పేరుతో అరాచకాలు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బక్రీద్ పండుగ అంటూ భారీ స్థాయిలో గోవధ జరుగుతోందంటూ ఆరోపించారు. వ్యవసాయంలో అన్నదాతలకు సహకరించే ఆవులు, ఎద్దులను వధించడం ఘోర పాపం అని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపం ఊరికే పోదని, గోవధ చేసిన వాళ్లతో పాటు.. దేశంలోని ప్రతి పార్లమెంటు సభ్యుడికి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వాళ్ల కుటుంబసభ్యులకు కూడా తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ పాపం వాళ్లను కొన్ని తరాల పాటు వెంటాడుతుందని రాజాసింగ్ హెచ్చరించారు.
దేశంలో అసలు గోవధను ఎందుకు నిషేధించడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. గతంలో కొందరు ఎంపీలు గోవధ నిషేధంపై ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు కొందరు ఎంపీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలను ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు. గోవులను చంపి తినే వారితో పాటు, ఈ విషయంలో మౌనంగా ఉంటున్న ఎంపీలకు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ పాపంలో భాగం ఉంటుందని ఆయన ఆరోపించారు.
ఈ పాపం నుంచి బయట పడాలంటే.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే గోవధను పూర్తిగా నిషేధిస్తూ చట్టం తేవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అలాగే, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. గోవధను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నందునే రెండు మూడు రోజులుగా తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు.