కేరళలోఘనంగా జరుగుతున్న కొట్టియూర్‌ ఉత్సవం

The Kottiyur region in Kerala is considered to be Dakshinkashi

Update: 2025-06-23 05:22 GMT

ఆలయ ఉత్సవాలకు, వేడుకలకు కేరళ పెట్టింది పేరు! అసలు అక్కడ జరిగే పండుగలు మరెక్కడా జరగవు. ప్రతి రోజూ అక్కడ పండుగే! పరమశివుడు కొలువై ఉన్న కొట్టియూర్‌ క్షేత్రంలో ఇప్పుడు వైశాఖ పండుగ జరుగుతోంది. ఈ నెల ఎనిమిదిన మొదలైన కొట్టియూర్‌ ఉత్సవం వచ్చే నెల నాలుగు వరకు కొనసాగుతుంది. కొట్టియూర్‌ క్షేత్రం జంట ఆలయాలకు కేంద్రం! ఈ క్షేత్రాన్ని దక్షిణకాశిగా భావిస్తారు భక్తులు. బవాలి నది తూర్పు, పడమర తీరాల్లో ఉన్న ఓ చిన్నిగ్రామంలో ఈ ఆలయాలు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అరణ్యాలు, గలగలమని ప్రవహించే బవాలి నది. పరమేశ్వరుడినే కాదు ప్రకృతి ఆరాధకులకు కూడా ఈ క్షేత్ర దర్శనం ఓ దివ్యానుభవం!

28 రోజులపాటు జరిగే వైశాఖ పండుగ కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. భగవంతుడి ముందు కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది దక్షిణభారత కుంభమేళ! ముస్లింలకు హజ్‌యాత్ర ఎలాంటిదో హిందువులకు వైశాఖ మహోత్సవ యాత్ర అలాంటిది! సుదూర ప్రాంతాల నుంచి ఈ ఉత్సవానికి తరలివస్తారు. బవాలి నది పశ్చిమ తీరంలో త్రిచెరుమాన వడక్కెశ్వరన్‌ ఆలయం ఉంది. దీన్ని స్థానికులు ఇక్కరె కొట్టియూర్‌గా పిలుచుకుంటారు. తూర్పుతీరంలో ఉన్న తాత్కాలిక ఆలయంలోనే వైశాఖ ఉత్సవం జరుగుతుంది. దీన్ని అక్కరె కొట్టియూర్‌ అంటారు. వైశాఖ మహోత్సవం సమయంలోనే ఈ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సందర్భంగా అక్కడ అనేక గుడిసెలు వెలుస్తాయి. ఉత్సవం అయ్యాక వాటన్నింటిని తొలగిస్తారు. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ యజ్ఞభూమిని సందర్శించుకుంటారు.

యజ్ఞవాటిక దగ్గరే స్వయంభూ శివలింగం ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణం, గర్భగుడి, ధ్వజస్తంభం వంటివేమీ ఉండవు. నదిలోని రాళ్లతో నిర్మించిన ఓ గట్టు మాత్రమే ఉంటుంది. దీన్ని మణితర అంటారు. అక్కడున్న తిరువంచిర అనే తటాకం మధ్యలో ఈ గుడి కాని గుడి ఉంటుంది. ఈ చెరువు నీళ్లు బవాలి నదిలో కలుస్తాయి. మణితరకు పక్కనే వృత్తాకారపు మరో గట్టు ఉంటుంది. దీన్ని అమ్మరకల్‌ తార అంటారు. ఆ ముందు జయంతి విలక్కు అంటే లక్ష్మీ దీపం ఉంటుంది. తాటి ఆకులతో చేసిన ఛత్రఛాయలో శివలింగం ఉంటుంది. దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందన్నది భక్తుల నమ్మకం.అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నది కూడా ఇక్కడే అంటారు భక్తులు.

ఇక్కరె కొట్టియూర్‌ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని ప్రతీతి. వైశాఖ మాసం స్వాతి నక్షత్రం రోజున ప్రారంభమయ్యే వేడుకలు జేష్టమాసం చిత్ర నక్షత్రం వరకు కొనసాగుతాయి.. ఉత్సవాల సమయాల్లో మిగతా ఆలయాల్లోలా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరగవు. కేవలం వేదమంత్రాల ఘోష మట్టుకే వినిపిస్తుంటుంది. 28 రోజులపాటు వివిధ రకాల పూజాధికాలు జరుగుతాయి. వీటిల్లో రోహిణి ఆరాధన ప్రధానమైనది. శైవక్షేత్రంలో వైష్ణవ పూజారి ఈ తంతు నిర్వహిస్తాడు. ఆయన మహావిష్ణువు ప్రతినిధి అన్నమాట! నెయ్యాటంతో మొదలయ్యే ఈ ఉత్సవం ఎలనీరట్టంతో ముగుస్తుంది.. భక్తులిచ్చిన కొబ్బరికాయలను కొట్టి.. ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయడమే ఎలనీరట్టం!

Tags:    

Similar News