2026 T20 World Cup: టీమ్ ఇండియాకు భారీ షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం

స్టార్ బౌలర్‌కు గాయం

Update: 2026-02-05 05:40 GMT

2026 T20 World Cup: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగుతున్న భారత జట్టును గాయాల బెడద కలవరపెడుతోంది. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌కు కేవలం రెండు రోజుల ముందు, యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయపడటం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం రాత్రి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన హర్షిత్ రాణా.. ఆ ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చాడు. అయితే, ఆ ఓవర్ వేసే సమయంలో రెండుసార్లు రనప్ మధ్యలోనే ఆగిపోయిన రాణా, మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత అతను తిరిగి బౌలింగ్‌కు రాలేదు. ఇప్పటికే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల గాయంతో జట్టుకు దూరంగా ఉండగా, ఇప్పుడు హర్షిత్ రాణా ఫిట్‌నెస్ సమస్య జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. రాణా గాయం తీవ్రతపై బీసీసీఐ (BCCI) నుండి ఇంకా అధికారిక ప్రక్రియ వెలువడాల్సి ఉంది.

మరోవైపు, గత నెలలో సర్జరీ చేయించుకున్న తిలక్ వర్మ ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా పూర్తి ఫిట్‌నెస్‌ను చాటుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి మెరుపు దాడి చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53) కూడా అర్ధసెంచరీతో ఫామ్ చాటుకోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు కట్టడి చేయడంతో టీమ్ ఇండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాకపోగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడం విశేషం. ఫిబ్రవరి 8న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. అయితే, కీలక బౌలర్లు గాయాల బారిన పడటం టోర్నీ ముందు భారత్‌కు పెను సవాలుగా మారింది.

Tags:    

Similar News