Rishabh Pant: అభిషేక్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ : రిషబ్ పంత్
అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ : రిషబ్ పంత్
Rishabh Pant: ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరగనున్న మ్యాచ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తమ టీ20 ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా అదిరిపోయే ఫామ్‌లో ఉండటంతో ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సీనియర్లు, యువ ఆటగాళ్ల కలయికతో జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేస్తున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి కళ్లు ఉన్నాయి. తనదైన దూకుడైన ఆటతీరుతో అభిషేక్ ఇప్పటికే జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు.
అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని పంత్ కొనియాడారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన పంత్, అభిషేక్ సాధిస్తున్న వరుస విజయాలు కేవలం అదృష్టం వల్ల వచ్చినవి కావని, అతని వెనుక బలమైన శ్రమ, ఆత్మవిశ్వాసం ఉన్నాయని పేర్కొన్నారు. ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు అతను తన ఫామ్‌ను నిలకడగా కొనసాగించడం విశేషమని, నిలకడ అనేది సరైన ప్రాసెస్ అనుసరిస్తేనే వస్తుందని పంత్ అభిప్రాయపడ్డారు.
అభిషేక్ శర్మ గణాంకాలు కూడా అతని దూకుడును స్పష్టం చేస్తున్నాయి. 2024లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు 38 మ్యాచుల్లో సుమారు 1,300 పరుగులు సాధించాడు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే, అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 195గా ఉంది. ఇది టీ20 ఫార్మాట్‌లో అతని ఇంపాక్ట్ ఎంతలా ఉందో తెలియజేస్తోంది. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా అభిషేక్ సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఇదే సందర్భంలో తన కెరీర్‌పై మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రభావం గురించి పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ద్రవిడ్ తనకు నేర్పించారని పంత్ గుర్తు చేసుకున్నారు. "నువ్వు సెంచరీ చేసినా లేదా డకౌట్ అయినా.. ఒకేలా ఉండటానికి ప్రయత్నించు" అని ద్రవిడ్ చెప్పిన మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. ఒక అథ్లెట్‌గా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టమైన పనే అయినప్పటికీ, తాను ఎప్పుడూ ఒకేలా ఉండటానికే ప్రయత్నిస్తానని, అయితే పరుగులు చేసినప్పటి సంతోషం కంటే అవుటైనప్పుడు కలిగే బాధే ఎక్కువగా ఉంటుందని పంత్ మనసులో మాట చెప్పారు.