Ashes Fourth Test: యాషెస్ నాలుగో టెస్టు: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్!
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్!
Ashes Fourth Test: ఇంగ్లాండ్‌తో జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లైయన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
కమిన్స్‌కు విశ్రాంతి.. లైయన్‌కు గాయం జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నిర్వహణలో భాగంగా ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు, మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ నాథన్ లైయన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి కాలికి శస్త్రచికిత్స అవసరమని, దీంతో అతను సుదీర్ఘ కాలం ఆటకు దూరం కానున్నాడని సమాచారం. లైయన్ స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీని సెలక్టర్లు ఎంపిక చేశారు.
మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరోసారి జట్టు పగ్గాలను చేపట్టనున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు టెస్టుల్లో కూడా కమిన్స్ లేకపోవడంతో స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా మూడో టెస్టుకు దూరమైన స్మిత్, ఇప్పుడు పూర్తిగా కోలుకుని నేరుగా కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. అతను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.
ఓపెనింగ్ జోడీపై ఆసక్తి స్మిత్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో నాలుగో స్థానంలో ఆడి హాఫ్ సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా తిరిగి ఓపెనర్‌గా వస్తారా? లేక ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. హెడ్ ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి ఫామ్‌లో ఉండటంతో ఓపెనింగ్ స్థానంలో అతనే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నాలుగో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జేక్ వెథరాల్డ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (కీపర్), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెసెర్, జై రిచర్డ్సన్, బ్యూ వెబ్‌స్టర్.