Asia Cup: ఆసియా కప్: సూపర్-4కు దూసుకెళ్లిన శ్రీలంక, బంగ్లాదేశ్
సూపర్-4కు దూసుకెళ్లిన శ్రీలంక, బంగ్లాదేశ్
Asia Cup: ఆసియా కప్ గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక ఘన విజయం సాధించడంతో ఆ జట్టుతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4 దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ (74 నాటౌట్; 52 బంతుల్లో 10×4) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ (26 నాటౌట్) కూడా రాణించడంతో శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మొహమ్మద్ నబీ వీరోచిత పోరాటం వృథా
అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ కష్టాల్లో పడింది. అయితే ఆఖర్లో మొహమ్మద్ నబీ (60; 22 బంతుల్లో 3×4, 6×6) వీరోచితంగా ఆడి జట్టు స్కోరును 8 వికెట్ల నష్టానికి 169కి చేర్చాడు. కేవలం 22 బంతుల్లోనే 60 పరుగులు చేసి నబీ ఆసియా కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అయితే ఆయన వీరోచిత పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 4 వికెట్లు తీసి అఫ్గానిస్థాన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన శ్రీలంక గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో బంగ్లాదేశ్ (రెండు విజయాలు) రెండో స్థానంతో సూపర్-4కు అర్హత సాధించింది. ఒకవేళ శ్రీలంకపై అఫ్గానిస్థాన్ గెలిచి ఉంటే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టు సూపర్-4లో ప్రవేశించేది.