Badminton Asia Championships: ఇవాళ్టి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్
Badminton Asia Championships: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆరంభానికి ముందే టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నారు.సాత్విక్ భుజం గాయం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ టాన్ కిమ్ హెర్ వెల్లడించారు. వీరి గైర్హాజరీ డబుల్స్ విభాగంలో భారత పతక అవకాశాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది.అయితే, సింగిల్స్‌లో లక్ష్య సేన్, పీవీ సింధు భారత సవాల్‌కు నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు సింగిల్స్ టైటిల్ దక్కి దాదాపు 61 ఏళ్లు కావస్తోంది. 1965లో దినేశ్ ఖన్నా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఆ ఘనత ఎవరికీ సాధ్యపడలేదు.
ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్.. ఈసారి స్వర్ణంతో ఆ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉన్నాడు. తొలి రౌండ్‌లో అతను హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియుతో తలపడనున్నాడు.ఇక ఇతర స్టార్ల విషయానికి వస్తే.. హెచ్‌ఎస్ ప్రణయ్ క్వాలిఫయర్ ప్లేయర్‌తో తన పోరును ఆరంభించనుండగా, మాజీ వరల్డ్ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి మ్యాచ్‌లోనే ఎనిమిదో సీడ్ లో కీన్ యూ వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొనబోతున్నాడు.
మరోవైపు విమెన్స్ సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుపై భారీ అంచనాలున్నాయి. గాయం నుంచి కోలుకొని వస్తున్న సింధు.. తొలి మ్యాచ్‌లో మలేసియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌తో తలపడనుంది. వీరికి తోడు ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్, తన్వీ శర్మ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.డబుల్స్ విభాగంలో గాయత్రి - ట్రీసా జాలీ జోడీ కూడా విత్‌డ్రా కావడంతో, భారత్ తరపున అశ్విని భట్-శిఖా గౌతమ్, శ్రుతి మిశ్రా-ప్రియ జోడీలు మాత్రమే బరిలో నిలిచాయి