Samson Ganguly’s Sensational Remarks: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చిన తర్వాత, అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శాంసన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. వైట్-బాల్ క్రికెట్‌లో సంజూ శాంసన్ నూటికి నూరు శాతం భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గతంలో శాంసన్‌ను విమర్శించిన వారికి గంగూలీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఆదివారం జరిగిన కీలకమైన క్వార్టర్ ఫైనల్ తరహా మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచిన తీరు అద్భుతమని గంగూలీ కొనియాడారు. "సంజూ గొప్ప ఆటగాడు. తను క్రీజులో నిలబడితే ప్రత్యర్థి జట్టుకు ప్రమాదమే అని ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు" అని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా శాంసన్ జట్టులో చోటు కోసం ఇబ్బంది పడినప్పుడు, అతనిపై వచ్చిన విమర్శల గురించి గంగూలీ ఘాటుగా స్పందించారు.

"కొన్ని నెలల క్రితం వరకు 'సంజూ మళ్ళీ విఫలమయ్యాడు', 'అతనికి జట్టులో చోటు అవసరమా?', 'అంత ప్రతిభ ఉన్న శుభ్‌మన్ గిల్ జట్టులో ఎందుకు లేడు?' వంటి వార్తలు నేను చదివాను. కానీ అదే కుర్రాడు ఇప్పుడు అత్యంత ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌ను సెమీస్‌కు తీసుకెళ్ళాడు" అని గంగూలీ వ్యాఖ్యానించారు. సెమీఫైనల్‌లో భారత్ తలపడబోయే ఇంగ్లాండ్ జట్టు, వెస్టిండీస్ కంటే చాలా బలంగా ఉంటుందని, టీమిండియా ఇదే జోరును కొనసాగించాలని ఆయన సూచించారు.

Tags: