Ashwin’s Sarcastic Remarks: మా విజయంలో హారిస్ రవూఫ్ కీలకం.. అశ్విన్ సెటైర్లు
అశ్విన్ సెటైర్లు
Ashwin’s Sarcastic Remarks: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా పాకిస్థాన్‌పై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం సాధించడానికి పాక్ పేసర్ హారిస్ రవూఫ్ ముఖ్యపాత్ర పోషించాడని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యంగ్యంగా చురకలంటించారు. రవూఫ్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడాన్ని ఉద్దేశిస్తూ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
తిలక్ వర్మ అద్భుతం.. రవూఫ్ దయ
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఫలమవడంతో 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ క్లిష్ట సమయంలో మిడిల్ ఆర్డర్‌లో నిలదొక్కుకున్న తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. తిలక్ 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ ప్రదర్శనను కొనియాడిన అశ్విన్, అదే సమయంలో రవూఫ్‌ను విమర్శించాడు.
"తిలక్ వర్మ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్లిష్ట సమయంలో ఒత్తిడి తట్టుకొని అతడు చక్కగా రాణించాడు. మేం చాలా తేలిగ్గా మ్యాచ్ గెలిచాం. ఇందుకు హారిస్ రవూఫ్‌నకు కృతజ్ఞతలు" అని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించారు.
తిలక్ బ్యాటింగ్ విశ్లేషణ
తిలక్ వర్మ బ్యాటింగ్‌ను విశ్లేషిస్తూ, "తిలక్ వర్మ స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. స్వీప్ షాట్లు బాగా ఆడాడు. బంతిని ఎక్కువగా గాల్లోకి లేపకుండా నేల మీదుగా కొట్టడంలో సక్సెస్ అయ్యాడు. పిచ్‌కు తగ్గట్లుగా, తెలివిగా.. తన షాట్ల ఎంపికలో మార్పులు చేసుకున్నాడు. అతడు చివర్లో రవూఫ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ తేలికగా అనిపిస్తుంది. కానీ ఆ షాట్ ఆడటం చాలా కష్టం" అని అశ్విన్ వివరించారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ కేవలం 3.4 ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే.
స్పిన్నర్లదే కీలకం.. పాక్ vs శ్రీలంక
వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ చక్కగా బౌలింగ్ చేయడం వల్లే భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పాక్ ఇన్నింగ్స్‌ను విశ్లేషిస్తూ, ఫర్హాన్, ఫకార్ జమాన్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా తర్వాతి బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు. "పాకిస్థాన్‌కు, శ్రీలంకకు మధ్య ఇదే తేడా. శ్రీలంక ఆటగాళ్లు.. భారత స్పిన్నర్లను చక్కగా ఎదుర్కొన్నారు. షాట్ల ఎంపిక కూడా పాకిస్థాన్ ఆటగాళ్లతో పోల్చుకుంటే.. వారిదే బాగుంది" అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.