IPL 2026: బౌలర్లపై హార్దిక్ పాండ్యా ఫైర్

హార్దిక్ పాండ్యా ఫైర్

Update: 2026-04-08 04:43 GMT

IPL 2026: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా ఇది ముంబైకి రెండో ఓటమి.

మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. ఈ ఓటమికి బ్యాటర్లను బాధ్యులను చేయనని, బౌలింగ్ విభాగమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. "ఇది ఖచ్చితంగా బౌలర్ల వైఫల్యమే. టి20 క్రికెట్‌లో రెండు మంచి బంతులు వేయడం చాలా ముఖ్యం. మేము కేవలం 27 పరుగుల తేడాతో ఓడిపోయామంటే.. అక్కడ ఒక ఐదు మంచి బంతులు వేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రణాళికలను అమలు చేయడంలో మా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు" అని హార్దిక్ మండిపడ్డారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆరంభంలోనే విరుచుకుపడి తమను మ్యాచ్‌ నుంచి దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముంబై స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక్క హార్దిక్ మినహా మిగిలిన బౌలర్లందరి ఎకానమీ రేటు 10 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మా బౌలర్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదని, ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటామని హార్దిక్ ముగించారు. తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీని మాత్రం హార్దిక్ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:    

Similar News