IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్!
కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్!
IPL 2026: వచ్చే ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త సారథిని ఖరారు చేసింది. స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించనుంది. గత కొన్ని సీజన్లుగా జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన పరాగ్, ఇప్పుడు సంజూ శామ్సన్ స్థానంలో జట్టు బాధ్యతలను అందుకోబోతున్నాడు. శామ్సన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో, రాజస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్ యువ రక్తం వైపు మొగ్గు చూపింది. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూల తర్వాత, పరాగ్ నాయకత్వ లక్షణాలపై నమ్మకంతో అతన్నే ఫైనల్ చేసినట్లు సమాచారం.
గత ఏడాది సంజూ శామ్సన్ గాయపడినప్పుడు, ఎనిమిది మ్యాచ్‌ల్లో పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో జట్టుకు కేవలం రెండు విజయాలే దక్కినప్పటికీ, పరాగ్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా కోల్‌కతాపై అతను సాధించిన 95 పరుగులు అతని కెరీర్‌లోనే బెస్ట్ స్కోరుగా నిలిచాయి. 2019లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పరాగ్, అప్పటి నుంచి రాజస్థాన్ జట్టుతోనే కొనసాగుతున్నాడు. 2024 సీజన్‌లో అతను చేసిన 573 పరుగులు అతన్ని లీగ్‌లోని మేటి బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టాయి.
ఈసారి రాజస్థాన్ రాయల్స్ పూర్తి కొత్త హంగులతో బరిలోకి దిగుతోంది. రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత కొత్త కోచ్, కొత్త కెప్టెన్‌తో కలిసి జట్టు ప్రయాణం మొదలవ్వనుంది. సంజూ శామ్సన్ ట్రేడింగ్‌లో భాగంగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి స్టార్ ఆల్ రౌండర్లు రాజస్థాన్ జట్టులోకి రావడం విశేషం. అనుభవజ్ఞుడైన జడేజా జట్టులో ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 24 ఏళ్ల పరాగ్‌కే పగ్గాలు అప్పగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.