IPL 2026: రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
IPL 2026: ఆదివారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును అధిగమించారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీకి చెన్నై జట్టుపై 1,174 పరుగులు ఉన్నాయి. ఇంతకుముందు రోహిత్ శర్మ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చేసిన 1,161 పరుగులే రికార్డుగా ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో మూడో స్థానంలో కూడా కోహ్లీయే ఉన్నారు (పంజాబ్ కింగ్స్‌పై 1,159 పరుగులు).
బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆర్‌సీబీ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 250/3 అనే భారీ స్కోరు సాధించింది. ఇది ఐపీఎల్ 2026లో నమోదైన అత్యధిక స్కోరు. టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులతో విరుచుకుపడగా, రజత్ పాటిదార్ (48 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (50) మెరుపులు మెరిపించారు.
251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని ఆర్‌సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ (3/41) తన స్పెల్‌తో చెన్నై నడ్డి విరిచారు. ఇదే మ్యాచ్‌లో భువీ తన 200వ ఐపీఎల్ వికెట్‌ను కూడా తీయడం విశేషం. చివరకు చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆర్‌సీబీ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఆర్‌సీబీ వరుసగా నాలుగు విజయాలు నమోదు చేయడం ఇదే తొలిసారి.