Mumbai Indians: ముంబై క్యాంప్‌లోకి 'యార్కర్ కింగ్'.. కేకేఆర్‌తో తొలి పోరుకు బుమ్రా రెడీ!

కేకేఆర్‌తో తొలి పోరుకు బుమ్రా రెడీ!

Update: 2026-03-28 07:37 GMT

Mumbai Indians: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఊరట లభించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు జట్టుతో చేరారు. ఆదివారం (మార్చి 29) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న ముంబై తొలి మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు బుమ్రా రాకతో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఆయన గత వారం రోజులుగా బెంగళూరులోని ఎన్‌సీఏ (NCA)లో శిక్షణ పొందుతుండటంతో, ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

తొలి ప్రాక్టీస్ సెషన్:

తాజా సమాచారం ప్రకారం, బుమ్రా శుక్రవారం రాత్రే ముంబై జట్టుతో చేరారు. శనివారం (మార్చి 28) ఆయన తన తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచి భారత్‌కు కప్ అందించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీసీసీఐ మెడికల్ టీమ్ సూచన మేరకు ఆయన తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

బీసీసీఐ ప్రత్యేక నిఘా:

ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో, బుమ్రాపై పనిభారం పడకుండా బీసీసీఐ ప్రత్యేక నిఘా ఉంచింది. ఐపీఎల్ జరుగుతున్న రెండు నెలల పాటు ఆయన ఫిట్‌నెస్‌ను బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు 186 వికెట్లు తీసిన బుమ్రా, ఈ సీజన్‌లోనూ ఆ జట్టుకు ప్రధాన అస్త్రం కానున్నారు.

ముంబై ఎదురుచూపులు:

వాంఖడే స్టేడియంలో ముంబై జట్టు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత సారథి హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, 2012 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌ను గెలవలేదు. ఈసారి బుమ్రా రాకతో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, కేకేఆర్‌పై విజయంతో బోణీ కొట్టాలని ముంబై భావిస్తోంది.

Tags:    

Similar News