Mitchell Starc: మిచ్సన్ స్టార్క్ అరుదైన మైలురాయి: కపిల్ దేవ్‌ను అధిగమించిన ఆసీస్ పేసర్
కపిల్ దేవ్‌ను అధిగమించిన ఆసీస్ పేసర్
Mitchell Starc: ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) టెస్ట్ క్రికెట్‌లో సంచలన మైలురాయిని చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో డార్విన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్‌ను పెవిలియన్ పంపడం ద్వారా స్టార్క్ తన 106వ టెస్టు మ్యాచ్‌లో 435వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. దీని ద్వారా భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ (131 టెస్టుల్లో 434 వికెట్లు) రికార్డును ఆయన తుడిచిపెట్టేశారు.
ఈ ఘనత సాధించడం ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్ 11వ స్థానానికి చేరుకున్నారు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ఆయన ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ స్థానంలో నిలిచారు. రికార్డుల విషయానికొస్తే, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ముందు దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (439 వికెట్లు) ఉన్నారు.
స్టార్క్ తన పదునైన బౌలింగ్‌తో రెండు వికెట్లు (షద్మాన్ ఇస్లామ్, లిటన్ దాస్) తీసినప్పటికీ, బంగ్లాదేశ్ బ్యాటర్లు గట్టి పోటీనిచ్చారు. తాంజిద్ హసన్ (101*) సెంచరీకి తోడు నజ్ముల్ హుస్సేన్ శాంటో (84) అర్ధసెంచరీ చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.