Nuwan Thushara: శ్రీలంక బోర్డుపై కోర్టుకెక్కిన ఆర్సీబీ ప్లేయర్
ఆర్సీబీ ప్లేయర్
Nuwan Thushara: శ్రీలంక క్రికెట్ బోర్డు వర్సెస్ నువాన్ తుషారా! ఐపీఎల్ ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదని కన్నెర్ర చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్.. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు.ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ ఐపీఎల్‌లో ఆడేందుకు లంక బోర్డు తనకి అడ్డంకులు సృష్టిస్తోందని నువాన్ తుషారా ఆరోపిస్తున్నారు. తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇచ్చేలా బోర్డును ఆదేశించాలని కోరుతూ ఆయన కొలంబో జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఐపీఎల్‌లో ఆడేందుకు తక్షణమే క్లియరెన్స్ ఇవ్వాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ ప్రమాణాలను తుషారా అందుకోలేకపోయారట. ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అందుకే ఎన్ఓసీని హోల్డ్‌లో పెట్టామని బోర్డు భావిస్తోంది. కానీ, తాను ఫిట్‌గా ఉన్నానని, తనకు అన్యాయం జరుగుతోందని తుషారా వాదిస్తున్నారు.ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తుషారా భవితవ్యం ఇప్పుడు కోర్టు చేతుల్లో ఉంది. ఈ నెల 9న కొలంబో జిల్లా కోర్టు ఈ కేసును విచారించనుంది. ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తుషారా ఐపీఎల్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది తేలిపోనుంది. ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ స్లింగర్ బౌలర్ కోర్టు అనుమతితో ఐపీఎల్ బరిలోకి దిగుతాడో లేదో వేచి చూడాలి.