Pak Media’s Over-Smart Move Backfires: పాక్ మీడియా అతి తెలివి.. రాజీవ్ శుక్లా ఫేక్ వీడియోతో దొరికిపోయారు

రాజీవ్ శుక్లా ఫేక్ వీడియోతో దొరికిపోయారు

Update: 2026-02-12 09:48 GMT

Pak Media’s Over-Smart Move Backfires: పాకిస్థాన్ టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ఫేక్ వీడియోపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రంగా స్పందించారు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ విషయంలో ఆయన అన్నట్లుగా ప్రచారమవుతున్న మాటల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియోను AI సాయంతో మార్చేశారని, దీన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన సోషల్ మీడియా వేదికగా విన్నవించారు.

అసలేం జరిగిందంటే, పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్ వై (ARY) న్యూస్ ఛానెల్‌లో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఒక కార్యక్రమంలో రాజీవ్ శుక్లాకు సంబంధించిన ఒక క్లిప్‌ను ప్రసారం చేశారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్థాన్, ఆ తర్వాత వెనక్కి తగ్గి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ పరిణామంపై రాజీవ్ శుక్లా సంతోషం వ్యక్తం చేస్తూ, బీసీసీఐ కోరిక మేరకు ఐసీసీ పాకిస్థాన్‌ను ఒప్పించిందని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే, ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసినదని, తన గొంతును ఏఐతో మార్చారని శుక్లా క్లారిటీ ఇచ్చారు.

రాజీవ్ శుక్లా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ గురించి నా వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియోను ఏఐ ఉపయోగించి మార్చారు. ఆ వీడియోలో ఉన్న మాటలు నావి కావు. ఇలాంటి తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను ఎవరూ నమ్మవద్దు, షేర్ చేయవద్దు. ఎక్కడైనా ఇలాంటి వీడియోలు కనిపిస్తే రిపోర్ట్ చేయండి" అని కోరారు. పాకిస్థాన్ మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఫేక్ వీడియోను ప్రసారం చేయడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నిజానికి రాజీవ్ శుక్లా అసలు వ్యాఖ్యలు వేరేలా ఉన్నాయి. గత మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్-పాక్ మ్యాచ్ యథావిధిగా జరిగేలా ఐసీసీ చొరవ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ ప్రతినిధులు లాహోర్ వెళ్లి పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపి ఒక సయోధ్యకు రావడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. కేవలం క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ సమస్యను పరిష్కరించడాన్ని ఆయన స్వాగతించారు. కానీ, పాక్ టీవీ ఛానెల్ మాత్రం ఆయన మాటలను బీసీసీఐ ఒత్తిడికి పాక్ లొంగిపోయినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేసింది.

Tags:    

Similar News