Pakistan Super League (PSL 2026): లైవ్ టీవీలో దొరికిపోయిన పాక్ క్రికెటర్లు.. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో లాహోర్ ఖలందర్స్!

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో లాహోర్ ఖలందర్స్!

Update: 2026-03-30 10:06 GMT

Pakistan Super League (PSL 2026): పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026) మరోసారి ప్రతికూల కారణాలతో వార్తల్లో నిలిచింది. టోర్నీ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ స్టార్లు తప్పుకోవడం, ఆ తర్వాత మ్యాచ్ మధ్యలో బంతి రంగు మారడం వంటి వింత సంఘటనలు జరిగాయి. ఇప్పుడు తాజాగా లాహోర్ ఖలందర్స్ జట్టు ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోవడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అవమానకర ఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ ప్రారంభానికి ముందు లాహోర్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్ అంతా ఒకచోట చేరి బంతిని పరిశీలిస్తూ కనిపించారు. ఆ సమయంలో వారు బంతి ఆకారాన్ని లేదా స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు లైవ్ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఫఖర్ జమాన్ చేతిలో ఉన్న బంతిని హరీస్ రవూఫ్ తీసుకుంటుండగా, ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని బంతిని తనకివ్వాలని ఆదేశించారు. బంతి స్థితి మారిందని గుర్తించిన అంపైర్లు, ఫోర్త్ అంపైర్‌ను పిలిపించి కొత్త బంతిని మార్చడమే కాకుండా.. లాహోర్ ఖలందర్స్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు.

ఈ పెనాల్టీ లాహోర్ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. చివరి ఓవర్లో కరాచీ గెలవడానికి 14 పరుగులు కావాల్సి ఉండగా, ఈ 5 పరుగుల పెనాల్టీ వల్ల లక్ష్యం కేవలం 9 పరుగులకు తగ్గిపోయింది. దీంతో బ్యాటర్లపై ఒత్తిడి తగ్గిపోయింది. హరీస్ రవూఫ్ వేసిన ఆ ఓవర్లో అబ్బాస్ అఫ్రిది ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి కరాచీ కింగ్స్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు. గెలవాల్సిన మ్యాచ్‌ను లాహోర్ జట్టు తమ చేజేతులా చేజార్చుకుంది.

ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది స్పందిస్తూ.. తమకు దీని గురించి ఏమీ తెలియదని వింతగా సమాధానమిచ్చారు. "అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, వీడియో ఫుటేజీని చూసి చర్చిస్తాం. ఇప్పటికే అంపైర్లు పెనాల్టీ విధించారు కాబట్టి మేము ఇప్పుడు ఏమీ చేయలేం" అని చెప్పుకొచ్చారు. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Tags:    

Similar News