Rashid Khan: భారత్‌తో టెస్టుకు రషీద్ ఖాన్ దూరం?

రషీద్ ఖాన్ దూరం?

Update: 2026-04-09 03:06 GMT

Rashid Khan: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా టీమిండియాతో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత రషీద్ ఈ విషయాలను పంచుకున్నారు.

గత కొంతకాలంగా రషీద్ ఖాన్ తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ కోసం శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్న ఆయన, టోర్నీ ముగిసిన వెంటనే ఆపరేషన్ చేయించుకున్నారు. దీనివల్ల కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్ ఆడటం తన వెన్నుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రషీద్ ఆవేదన వ్యక్తం చేశారు.

"రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండమని నా డాక్టర్ నాకు గట్టిగా చెప్పారు. ఒకవేళ నువ్వు క్రికెట్ ఆడటం త్వరగా ఆపేయాలనుకుంటే టెస్టులు ఆడుకో అని ఆయన హెచ్చరించారు" అని రషీద్ సరదాగా అంటూనే అసలు భయాన్ని బయటపెట్టారు. జింబాబ్వేతో జరిగిన గత టెస్టులో ఏకంగా 167 ఓవర్లు బౌలింగ్ చేశానని, అంత భారాన్ని మోయడం ఇప్పుడు సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

"నాకు నా దేశం తరపున ఆడటం అంటే చాలా ఇష్టం. కానీ నా కెరీర్ సుదీర్ఘ కాలం సాగాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకే వన్డేలు, టీ20లకు ప్రాధాన్యత ఇస్తూ టెస్టుల విషయంలో 'టేక్ ఇట్ ఈజీ' అని అనుకుంటున్నాను. ఏడాదికి ఒక టెస్ట్ అయితే ఫర్వాలేదు కానీ, రోజు మొత్తం బౌలింగ్ చేయాల్సి వస్తే మాత్రం కష్టమే" అని రషీద్ స్పష్టం చేశారు. జూన్‌లో భారత్‌తో జరగనున్న టెస్టుకు ఆయన అందుబాటులో ఉండకపోవడం అఫ్గాన్ జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి.

Tags:    

Similar News