Sunil Gavaskar: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై సునీల్ గావస్కర్ ప్రశంసలు
సునీల్ గావస్కర్ ప్రశంసలు
Sunil Gavaskar: భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని గావస్కర్ పేర్కొన్నారు. వినూత్నంగా ఆలోచించే సారథిగా సూర్య నిలుస్తాడని అభినందించారు. ఒమన్‌తో మ్యాచ్‌లో సూర్య బ్యాటింగ్‌కు దిగకుండా మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను గావస్కర్ కొట్టిపారేశారు. ఈ నిర్ణయం సూర్య స్వార్థం కోసం కాదని, జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్నాడని చెప్పారు. ‘‘ఒకవేళ ఒమన్‌తో మ్యాచ్‌లో సూర్య ఒక్క ఓవర్ బ్యాటింగ్‌కు వచ్చినా కొన్ని సిక్స్‌లు, ఫోర్లు రాబట్టేవాడు. అది అతడికి మాత్రమే ప్రయోజనం. కానీ, అలా చేయలేదు. పాకిస్థాన్‌పై ఆడిన 47 పరుగుల ఇన్నింగ్స్ చాలు. అతడికి ప్రత్యేకంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ అవసరం లేదు. అందుకే, కుల్దీప్ యాదవ్‌ను కూడా క్రీజ్‌లోకి పంపాడు’’ అని గావస్కర్ తెలిపారు.
వినూత్న ఆలోచనల సారథి
త్వరగా వికెట్లు పడితే చివరి బ్యాటర్లు కూడా పరుగులు చేసేందుకు సిద్ధంగా ఉండాలనేది సూర్య ఆలోచన అని గావస్కర్ వివరించారు. శ్రీలంక పర్యటనలోనూ సూర్య స్వయంగా బౌలింగ్ చేసి రింకుకు బంతిని ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ వినూత్న ఆలోచనలే అతడిని అసాధారణ సారథిగా నిలబెడతాయని గావస్కర్ అభినందించారు.
పాక్‌కు గుణపాఠం నేర్పిన సూర్య
మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా ఉండాలని సూర్యకుమార్ నిర్ణయం తీసుకున్నారంటూ గతంలో సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఒమన్‌తో మ్యాచ్ అనంతరం సూర్య వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఒమన్ ఆటగాడు అమీర్ ఖలీమ్‌ను ఆలింగనం చేసుకొని అభినందించాడు. ఈ మ్యాచ్‌లో అమీర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కరాచీ నుంచి ఒమన్‌కు వచ్చి స్థిరపడిన ఈ క్రికెటర్‌తో సూర్య స్నేహపూర్వకంగా మాట్లాడుతూ కీలక సూచనలు కూడా ఇచ్చాడు. ఇది పాకిస్థాన్‌కు ఒక గుణపాఠంలా కనిపించిందని అభిమానులు అభిప్రాయపడ్డారు.