T20 World Cup 2026: కోహ్లీ, హార్దిక్ సరసన శివం దూబే.. టీ20 వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డు!
టీ20 వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డు!
T20 World Cup 2026: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా ఆల్ రౌండర్ శివం దూబే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడమే కాకుండా, బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో పాటు వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడిగా దూబే నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనతను లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రమే సాధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో శివం దూబే ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులు బాదిన దూబే, డచ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను అడ్డుకోవడంలోనూ దూబే తన వంతు సహకారం అందించాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ప్రమాదకరమైన బాస్ డి లీడేను అవుట్ చేయడమే కాకుండా, చివరి ఓవర్లో జాక్ లయన్-కాచెట్‌ను పెవిలియన్ పంపి భారత్‌కు 17 పరుగుల విజయాన్ని ఖాయం చేశాడు.
గతంలో ఈ రికార్డు సాధించిన ధీరులు వీరే:
టి20 ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో 50+ పరుగులు చేసి, వికెట్ తీసిన రికార్డు ఇప్పటివరకు కోహ్లీ, హార్దిక్ పేరిట మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి దూబే చేరాడు.
1. విరాట్ కోహ్లీ (రెండు సార్లు):
2012 ప్రపంచకప్ లో పాకిస్థాన్‌పై మిర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేయడమే కాకుండా, 21 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. 2016 ప్రపంచకప్ లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 89 (నాటౌట్) పరుగులు చేసి, బౌలింగ్‌లో జాన్సన్ చార్లెస్ వికెట్ పడగొట్టాడు.
2. హార్దిక్ పాండ్యా (రెండు సార్లు):
2024 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్‌పై జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 50 (నాటౌట్) పరుగులు చేసి, 32 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. 2026 ప్రపంచకప్ లో ప్రస్తుత టోర్నీలోనే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు.