Yuzvendra Chahal: 'మాకు కోహినూర్ వద్దు.. బుమ్రా ఉంటే చాలు': చాహల్ ప్రశంసల వర్షం!

బుమ్రా ఉంటే చాలు': చాహల్ ప్రశంసల వర్షం!

Update: 2026-03-06 04:49 GMT

Yuzvendra Chahal: భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ మెరుపులు మెరిపిస్తే, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తనదైన 'డెత్ ఓవర్ల' మ్యాజిక్‌తో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఈ విజయంతో భారత్ ఇప్పుడు ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ భారీ షాట్లతో టీమ్ ఇండియాను భయపెట్టినప్పటికీ, బుమ్రా తన అద్భుతమైన యార్కర్లు, స్లో బాల్స్‌తో పరుగులను కట్టడి చేశారు. ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించారు. బుమ్రా ప్రదర్శనపై భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తనదైన శైలిలో స్పందించారు. "బుమ్రాను భారత నిధి అని ఊరికే అనరు. ఆయన చేతులు కడుక్కున్న నీళ్లను మనం తాగినా తప్పులేదు" అని చాహల్ సరదాగా వ్యాఖ్యానించారు.

చాహల్ ఇంకా మాట్లాడుతూ.. "నిజానికి బుమ్రా లేకపోతే భారత్ ఫైనల్‌లో ఉండేది కాదు. మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా బుమ్రా కానీ, హార్దిక్ పాండ్యా కానీ అస్సలు భయపడరు. వారిని చూసి కేవలం అభిమానులమైన మనమే కంగారు పడతాం. మాకు కోహినూర్ వజ్రం అవసరం లేదు సోదరా.. మా దగ్గర జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు" అంటూ ఆకాశానికెత్తేశారు. బుమ్రా ప్రశాంతతను, నైపుణ్యాన్ని చూసి చాహల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా, ఈ సెమీఫైనల్ మ్యాచ్ బుమ్రా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన తన 500వ వికెట్‌ను సాధించి, ఈ ఘనత అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి బుమ్రా భీభత్సం సృష్టిస్తున్నారు.

Tags:    

Similar News