Neeraj Chopra: వచ్చే ఏడాది సత్తా చాటుతా: నీరజ్ చోప్రా

సత్తా చాటుతా: నీరజ్ చోప్రా

Update: 2025-09-20 06:48 GMT

Neeraj Chopra: టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నిరాశాజనకమైన ఎనిమిదో స్థానంలో నిలిచిన తర్వాత భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రదర్శనకు కారణం, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. ఫైనల్స్ కు ముందు తాను వెన్ను గాయంతో బాధపడ్డానని నీరజ్ చోప్రా వెల్లడించారు. ఛాంపియన్‌షిప్‌కు రెండు వారాల ముందు చెక్ రిపబ్లిక్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఈ గాయం అయ్యిందని తెలిపారు. దీనివల్ల గత రెండు వారాలుగా సరైన శిక్షణ తీసుకోలేకపోయానన్నారు.

గాయం కారణంగా తన ప్రదర్శనపై ప్రభావం పడిందని, తాను అనుకున్నంతగా త్రో చేయలేకపోయానని అన్నారు. "నేను ఆరోగ్యంగా లేను, శిక్షణ కూడా పెద్దగా లేదు" అని చెప్పారు. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తన ప్రదర్శన పట్ల నిరాశ చెందానని, ముఖ్యంగా ఫైనల్స్‌లో తన రన్-అప్ సరిగా లేదని చెప్పారు. తను సాధారణంగా పరిస్థితులను నియంత్రించగలనని, కానీ ఈ రోజు అలా జరగలేదని అన్నారు. అయితే ఈ ఫలితాన్ని అంగీకరించి, ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఈ సీజన్ సుదీర్ఘంగా సాగిందని, ఇప్పుడు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుని, వచ్చే ఏడాది కోసం సిద్దం అవుతానని నీరజ్ చోప్రా తెలిపారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా తన అత్యుత్తమ త్రోను 84.03 మీటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇది ఆయన గత ఏడేళ్లలో తొలిసారిగా టాప్-3లో నిలవకుండా ముగించిన ఒక అంతర్జాతీయ ఈవెంట్. అయితే, ఇదే పోటీలో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ 86.27 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో నాల్గవ స్థానంలో నిలవడం భారతీయ జావెలిన్ త్రోకు సానుకూల అంశం.

Tags:    

Similar News