స్కూల్‌ బీజేపీ, కాలేజీ టీడీపీ, రాహుల్‌ గాంధీ వద్ద ఉద్యోగం - రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

School BJP, college TDP, job with Rahul Gandhi - revanth's interesting comments

Update: 2025-06-08 10:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఐదుగురు గవర్నర్లు, మరో ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉప రాష్ట్రపతి ఉన్న వేదికపై రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. తన స్కూల్‌ బీజేపీలో సాగిందని, కాలేజీ తెలుగుదేశం పార్టీలో నడిచిందని, ఇప్పుడు రాహుల్‌ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.



హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో ఆదివారం జరిగింది. ఈ వేదికపై అనేక మంది ప్రముఖులు ఆసీనులయ్యారు. దత్తాత్రేయతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. దత్తాత్రేయతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే.. ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడారు. ప్రజలతో అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని తెలిపారు. ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసిందని కొనియాడారు. గౌలిగూడ గల్లీ నుంచి హరియాణ గవర్నర్‌గా దత్తాత్రేయ ఎదిగారని అన్నారు. ఏ రోజూ దత్తాత్రేయ ప్రజలతో సంబంధాలు కోల్పోలేదన్నారు. అలయ్ బలయ్‌తో రాజకీయలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.



పుస్తకావిష్కరణకు అన్ని పార్టీల నేతలు వచ్చారని, దత్తాత్రేయ బీజేపీ నేత అన్న రేవంత్‌రెడ్డి.. ఇది ఒక పార్టీకి చెందిన నాయకుడి కార్యక్రమం అనే భావన ఎవరికీ లేదని, ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడిగా దత్తాత్రేయను అందరూ చూస్తారని కొనియాడారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు దత్తాత్రేయ ఆత్మకథ చదవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. జాతీయ స్థాయిలో వాజ్‌పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో బండారు దత్తాత్రేయకు ఉందన్నారు. హైదరాబాద్‌లో నేతలు పీజేఆర్, బండారు దత్తాత్రేయ పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా.. ఏదైనా అవసరం ఉన్నా.. జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది వీరు ఇద్దరే అని కొనియాడారు. తాము తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి.. తన స్కూల్‌ బీజేపీ అని, కాలేజీ టీడీపీ అని, ఇప్పుడు ఉద్యోగం మాత్రం రాహుల్‌ గాంధీ దగ్గర చేస్తున్నానని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News