CM A. Revanth Reddy: క్యూర్‌లో 1,500 ఎకరాల్లో డేటా సిటీ.. హైదరాబాద్ వెలుపల జీసీసీలు, జిల్లాల్లోకి ఐటీ విస్తరణ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Update: 2026-05-21 11:15 GMT

పెట్టుబడుల ఆకర్షణకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఏజెన్సీ

హెల్త్‌సిటీలో వైద్య పర్యాటక కేంద్రం

CM A. Revanth Reddy: హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీ, ఉద్యోగ అవకాశాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా క్యూర్‌లో 1,500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లాల్లోనూ ఐటీ వెలుగులు వ్యాప్తం చేయాలని, హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు కంపెనీలను ప్రోత్సహించాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని ఆదేశించారు.

డేటా సిటీలో ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని వాడాలని, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ-హైదరాబాద్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రధాన రహదారుల సమీపంలోని ప్రభుత్వ భూములను గుర్తించి కేటాయించాలని చెప్పారు.

ఫ్యూచర్ సిటీలో నెట్‌జీరో విధానాలు

భారత్ ఫ్యూచర్ సిటీ (బీఎఫ్‌సీ)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణానికి అనుకూలమైన నెట్‌జీరో విధానాలు అమలు చేయాలని సీఎం సూచించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని, ఏఐ సిటీ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పూర్తయిన తర్వాతే భూకేటాయింపులు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీలో ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో చర్చలు జరపాలని తెలిపారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా మాట్లాడతానని చెప్పారు.

ఫ్యూచర్ సిటీలోని పారిశ్రామిక వాడలో కంపెనీల భూమిపూజలు త్వరలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, అక్కడ స్థాపించే సంస్థలు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకుని యువతలో నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసు అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

పెట్టుబడులకు ప్రత్యేక ఏజెన్సీ

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరిట ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందించే ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలని, గ్రూప్-1 స్థాయి అధికారిని నియమించాలని సూచించారు.

ఈ ఏజెన్సీలో ఐటీ, పరిశ్రమల శాఖలతో పాటు విద్యుత్, ఆర్థిక శాఖల అధికారులు కూడా ఉండాలని, తమిళనాడు, గుజరాత్‌లాంటి రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి ఉత్తమమైన విధానాలను అమలు చేయాలని చెప్పారు.

రానున్న మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్ ఇంటర్నెట్‌ను వినియోగించాలని ఆదేశించారు. ఇప్పటికే టీ-ఫైబర్‌కు మారిన కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ శశాంక్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News