A. Revanth Reddy: ఏఐ సవాళ్లను ఎదుర్కొనే తెలంగాణ ‘రైజింగ్’ వ్యూహం: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

తెలంగాణ ‘రైజింగ్’ వ్యూహం: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

Update: 2026-03-28 11:27 GMT

A. Revanth Reddy: కృత్రిమ మేధస్సు (ఏఐ) మానవ చరిత్రలో అత్యుత్తమ ఆవిష్కరణ అయినప్పటికీ, ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సరైన నియంత్రణలు లేకపోతే దాని ప్రతికూల ప్రభావాలు పెరిగే అవకాశం ఉందని, కొత్త సాంకేతికతలపై ఉన్న భయాలు సహజమే అయినా ఏఐ విషయంలో పరిస్థితి భిన్నమని అన్నారు.

ప్రపంచం ఏఐ విసురుతున్న సవాళ్లకు సమాధానంగా తెలంగాణ ‘రైజింగ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తొలి ఏఐ సింపోజియంలో తెలంగాణ తరఫున వర్చువల్‌గా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో మొదటి భారతీయ వక్తగా పాల్గొనడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు సీఎం వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో అద్భుతమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా ఏఐ అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ పేరుతో కొత్త నగర నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక ఏఐ సిటీని ఏర్పాటు చేసి, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐపై విస్తృత చర్చ జరుగుతోందని, చాట్‌జీపీటీ ప్రారంభం తర్వాత జెమినై, గ్రోక్‌, డీప్‌సీక్‌, పర్‌ప్లెక్సిటీ వంటి అనేక లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎంలు) రోజువారీ జీవితంలో భాగమయ్యాయని సీఎం వివరించారు. ఏఐ వైద్యులు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, రచయితలు, విధాన రూపకర్తల పాత్రను పూర్తిగా తొలగించకపోయినా పని స్వరూపాన్ని మార్చేస్తుందని, ప్రత్యేకంగా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని, సంస్థలు తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఏఐ ప్రభావాన్ని సమతౌల్యం చేయడానికి రాష్ట్రంలో పర్యాటకం, గ్రీన్‌ ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా పెట్టుబడులు పెంచుతున్నామని సీఎం ప్రకటించారు. బ్లూ కాలర్‌ ఉద్యోగాల సృష్టికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని, చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంలో భాగంగా తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి, గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం దృష్ట్యా భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి చర్యలు చేపట్టామని, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి రీ-స్కిల్లింగ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాలుష్య నియంత్రణలో కార్బన్‌ క్రెడిట్‌ వ్యవస్థను కూడా అమలు చేసి సమగ్ర అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ రైజింగ్‌ వ్యూహం ద్వారా ఏఐ సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News