Airtel: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు

రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు

Update: 2026-07-01 13:41 GMT

Airtel: ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయి, హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను సునీల్ మిత్తల్‌కు వివరంగా తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సునీల్ మిత్తల్‌కు సూచనలు చేశారు. చందన్‌వెల్లిలో ఎయిర్‌టెల్ నెలకొల్పనున్న డేటా సెంటర్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని, తెలంగాణలో మరింత భారీ సమగ్ర డేటా సెంటర్‌లు, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్‌లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలు, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని కోరారు. సునీల్ మిత్తల్ భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఐటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ముందుకొచ్చారు. ఫైబర్ కనెక్టివిటీని మరింత పెంచడంపైనా ఆసక్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ పెట్టుబడులు తెలంగాణలో ఉద్యోగ, ఆర్థిక అవకాశాలను మరింత పెంచుతాయని అంచనా.

Tags:    

Similar News