New Railway Division: కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు భారాస ఎంపీలు వినతి

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు భారాస ఎంపీలు వినతి

Update: 2026-03-28 11:22 GMT

New Railway Division: కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ను ప్రధాన కేంద్రంగా చేసి కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి (భారాస) ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు శుక్రవారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. కొత్తగూడెం స్టేషన్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు రాకపోకలకు కీలక కూడలి కేంద్రంగా మారిన నేపథ్యంలో దీనికి తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు.

వినతిపత్రంలో ఎంపీలు పేర్కొన్న వివరాల ప్రకారం... కొత్తగూడెం స్టేషన్‌కు బ్రిటిష్ పాలన కాలం నుంచి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఇక్కడి నుంచి బొగ్గు రవాణా జరిగేది. ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌కు ఇది ప్రధాన కేంద్రంగా మారింది. గూడ్స్ రవాణా ద్వారా భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయం వచ్చే ప్రాంతాల్లో కొత్తగూడెం ఒకటిగా నిలుస్తోంది.

కొత్తగూడెం-కిరండోల్, మల్కన్‌గిరి-భద్రాచలం, జునాగఢ్-మల్కన్‌గిరి-భద్రాచలం, కొత్తగూడెం-సత్తుపల్లి-కొవ్వూరు లింకులతో ఈ స్టేషన్ నాలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమైన రైలు సంధి కేంద్రంగా రూపొందింది. 2032లో వందేళ్లు పూర్తి చేసుకోబోయే ఈ స్టేషన్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

శతవసంతాల సందర్భంగా కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని ఎంపీలు తమ వినతిపత్రంలో స్పష్టం చేశారు. ఈ డిమాండ్‌ను కేంద్రం సానుకూలంగా పరిశీలించి త్వరగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Tags:    

Similar News