Chief Minister A. Revanth Reddy: విద్యార్థుల భవిష్యత్తుకు బలం – రూ.110 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

రూ.110 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

Update: 2026-04-09 03:42 GMT

Chief Minister A. Revanth Reddy: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను 100 శాతం సత్ఫలితాలు ఇచ్చేలా వినియోగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు రహేజా గ్రూపు, రాంకీ గ్రూపు రూ.50 కోట్లు చొప్పున, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు – మొత్తం రూ.110 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని సీఎం ప్రకటించారు.

కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను వీక్షించిన ఆయన, ఇప్పటివరకు ఈ నిధులకు సరైన విధానం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించిందని తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించాలని సూచించారు.

విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణ, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ వంటి ఏ రంగానికైనా ఈ నిధులను వాడవచ్చని సీఎం స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వంతోపాటు కంపెనీలు చేసే ఈ వ్యయాన్ని ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలి. ఇది రాష్ట్ర విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యమున్నవారిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా సిద్ధం చేయవచ్చు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

విద్యపై పెట్టే పెట్టుబడిని భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 44 శాతం మంది హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కంపెనీలు స్థానికంగా ఉన్న మౌలిక వసతులను వినియోగిస్తున్నందున సీఎస్‌ఆర్‌ నిధుల్లో ఎక్కువ భాగం అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని సూచించారు.

ఈ సమావేశంలో క్యూర్ పరిధిలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేలా నిర్మించనున్న 28 పాఠశాలల భవనాల నమూనాలను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. రెండు ఆర్కిటెక్ట్ కంపెనీలు రూపొందించిన డిజైన్లను చూసి స్వల్ప మార్పులతో ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News