BRS working chief KTR: కేటీఆర్‌పై ఈ వారమే చార్జ్‌షీట్‌!

ఈ వారమే చార్జ్‌షీట్‌!

Update: 2026-02-16 01:31 GMT

కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ అభియోగపత్రం దాఖలు

BRS working chief KTR: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈ వారంలోనే కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.

కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని, ఇక చార్జ్‌షీట్ దాఖలు చేయడమే మిగిలి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు చార్జ్‌షీట్‌కు తుదిరూపం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ (Department of Personnel and Training) అనుమతి కోసం ఆగిపోయింది. తాజాగా డీవోపీటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి అందడంతో, ప్రభుత్వం దానిని ఏసీబీకి తెలియజేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఈ వారంలో చార్జ్‌షీట్ దాఖలుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ కేసులో కీలకమైన ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలను సేకరించారు. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ వల్ల హెచ్‌ఎండీఏకు రూ.75.88 కోట్ల నష్టం జరిగిందని రుజువు చేయడానికి అవసరమైన ఆధారాలన్నీ సేకరించారు. ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీకి రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం క్విడ్ ప్రోకో (quid pro quo)లో భాగమేనని చార్జ్‌షీట్‌లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది నవంబరులో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి 2024 డిసెంబరు 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, కేటీఆర్‌లను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు.

చార్జ్‌షీట్‌లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని, ఇతరులకు లాభం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొననున్నట్లు సమాచారం.

Tags:    

Similar News