C. V. Anand: తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ అధిపతిగా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ గతంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఆధునిక పోలీసింగ్, సాంకేతిక వినియోగం, ప్రజలకు చేరువైన పోలీస్ వ్యవస్థపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల నిర్వహణతో పాటు సైబర్ నేరాలు, అంతర్గత భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళా భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి సీవీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా అందరి సహకారంతో పనిచేస్తానని చెప్పారు.

Tags: