CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి: త్వరలో హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పరిశీలన.. అధికారులకు హెచ్చరిక
అధికారులకు హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి: చెత్త కనిపిస్తే సహించను.. కఠిన చర్యలు!
CM Revanth Reddy: రాజధాని హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా చెత్త కనిపిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తానని, అపరిశుభ్రత ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖపై మంగళవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు కార్పొరేషన్ల (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి) కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. నగర పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.
నగరపాలక సంస్థల ఆదాయం పెంచేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలోని కీలక కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేసి, వాటిపై సీసీ కెమెరాలతో పాటు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచాలని సూచించారు. ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయాన్ని హైదరాబాద్‌తో పోల్చి బేరీజు వేయాలని, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్న ప్రకటనలదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకటనల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు 10 శాతం కేటాయించాలని సూచించారు.
పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) మరియు ఇతర నమూనాల ద్వారా ఆదాయం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలపై అధ్యయనం చేయాలని, నెక్లెస్‌రోడ్డు పక్కన ఇలాంటి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణకు ఏకరూప పద్ధతిని అనుసరించాలని సూచించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలోని పార్కుల వివరాలు సేకరించి, వాటి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
తాజాగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లకు త్వరలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, తాను కూడా హాజరై వారితో మాట్లాడతానని సీఎం తెలిపారు.
సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్వీ కర్ణన్, సృజన, వినయ్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.