Minister Seethakka: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత, జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

బీఆర్ఎస్ సభ్యుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని సీతక్క విమర్శించారు. తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి వంటి బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పై దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘అట్టడుగు వర్గాల బిడ్డలమనేనా.. ఇంత అవమానం?’’ అంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. స్పీకర్ తల్లిని అవమానించడం బాధాకరమని, ఆయన ఉన్నత స్థాయికి చేరినందుకు ఇలా చేయడం అన్యాయమని అన్నారు.

స్పీకర్‌పై ఇలా మాట్లాడినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని సీతక్క డిమాండ్ చేశారు. తాతా మధు సభ్యత్వం వెంటనే రద్దు చేయాలని కూడా పట్టుబట్టారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని, ఆయన దిశానిర్దేశంలోనే బీఆర్ఎస్ సభ్యులు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

దళితుడైన స్పీకర్‌ను ‘అధ్యక్షా’ అని సంబోధించాల్సి రావడం కేసీఆర్‌కు నచ్చడం లేదని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని సీతక్క విమర్శించారు. గతంలో కూడా దళిత నేతలపై బీఆర్ఎస్ వైఖరి ఇలాగే ఉందని, జగదీశ్ రెడ్డి వంటి వారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో దొర అహంకారం, దురాహంకారం నిండి ఉందని, పార్టీకి ప్రజా సంక్షేమం కాకుండా రాజకీయ డ్రామాలు మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని, బీఆర్ఎస్ సభ్యులు సంస్కారంతో మాట్లాడాలని సీతక్క స్పష్టం చేశారు. స్పీకర్‌కు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దళిత సమాజం గౌరవాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.

Tags: