Vanamahotsavam: వనమహోత్సవం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌ను పచ్చదనంతో తీర్చిదిద్దాలని పిలుపు

హైదరాబాద్‌ను పచ్చదనంతో తీర్చిదిద్దాలని పిలుపు

Update: 2026-06-18 10:30 GMT

Vanamahotsavam: రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం సాయంత్రం 4 గంటలకు నాగలింగం మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వనమహోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. “ఈరోజు గుర్రంగూడలో ప్రారంభించే వనమహోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు. ‘మొక్క’వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పానికి ఫలితం” అని అన్నారు.

గతంలో చెరువుల కబ్జా, అటవీ భూములపై అక్రమాలు జరిగి వర్షాలు పడితే హైదరాబాద్ అతలాకుతలమైన దృశ్యాలను గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూముల రక్షణ కోసం న్యాయపోరాటం చేసి పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే యజ్ఞం చేపట్టిందని స్పష్టం చేశారు.

2021లో వరదల సమయంలో గుర్రంగూడలో పర్యటించినప్పుడు తన మదిలో పుట్టిన ఆలోచనకు ఈ వనమహోత్సవం ఆచరణ రూపమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కబ్జాదారులపై న్యాయపోరాటం చేసి అటవీ భూములను రక్షించి, నగరాన్ని వనంలో జనం జీవించే ప్రాంతంగా మార్చే ప్రయత్నాలకు ఈ కార్యక్రమం ఉదాహరణ అని తెలిపారు.

పర్యావరణ సంరక్షణ, హరితాభ నగర నిర్మాణం వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దృక్పథం వ్యక్తం చేశారు. ఈ వనమహోత్సవం ద్వారా ప్రజల్లో మొక్కల నాటుట, పర్యావరణ భద్రత పట్ల అవగాహన పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

Tags:    

Similar News