CM Revanth Reddy: కెనడా హైకమిషనర్‌తో సీఎం రేవంత్ భేటీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం

పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం

Update: 2026-07-09 06:01 GMT

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కెనడా విశ్వవిద్యాలయాలు ఇక్కడ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

భారత్‌లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు మరియు సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలపరచే అంశాలపై ఇరు పక్షాలు విస్తృత చర్చ నిర్వహించాయి.

ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు ఆహ్వానించిన హైకమిషనర్ క్రిస్ కూటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జ్ఞాపిక అందజేశారు. సమావేశంలో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కెనడా సహకార అవకాశాలను ఇరువురు పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీల జీసీసీలు హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్‌లు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.

ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్‌లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

ఈ భేటీలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణా రావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక్, ఐటీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News