KTR Levels Allegations: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలా? : కేటీఆర్ ఆరోపణ

కేటీఆర్ ఆరోపణ

Update: 2026-03-03 09:55 GMT

KTR Levels Allegations: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసిన చాలదన్నట్టు, ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూల్చివేయడానికి కుట్రలకు తెర తీశారా? అని భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆయన సోమవారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, ఇది దుర్మార్గమే కాదు అతి పెద్ద నేరమని మండిపడ్డారు. బ్యారేజీ సమీపంలో తవ్వకాలు చేపట్టకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిన ఇసుక మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బ్యారేజీని బలహీనపరిచి, భారాసపై బురద జల్లే పన్నాగాలు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ వరప్రసాదిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

రేవంత్ సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి, అన్నారం బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతోందని, ఇది కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగమే అని విమర్శించారు. పట్టపగలే అన్నారం బ్యారేజీ నుంచి కాంగ్రెస్ నాయకుల మాఫియా ఇసుకను తవ్వేస్తోందని, తెలంగాణ వనరులను ఆ పార్టీ ఎలా కొల్లగొడుతుందో ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని, ఆ పార్టీకి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లో ఉందని కేటీఆర్ హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలం రద్దు చేయాలి

ఇదే సందర్భంగా, సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు జరిగాయని, ఆ టెండర్లను వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

జిల్లాలో సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు ఉందని, మైనింగ్ టెండర్ పత్రాల్లో చట్టబద్ధ వివరాలు పొందుపరచలేదని ఆరోపించారు. మినరల్ బ్లాక్‌ల అక్షాంశ-రేఖాంశాలు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డీజీపీఎస్ సర్వే, జియోలాజికల్ నివేదికలు లేకుండానే వేలం జరిగిందని, అటవీ శాఖ నుంచి ఎన్‌ఓసీ లేకుండా వేలం నిర్వహించారని పేర్కొన్నారు.

అటవీ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ చేపట్టితే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, మైనింగ్ నిబంధనలు-2015, హైకోర్టు సూచనలను పట్టించుకోలేదని విమర్శించారు. మైనింగ్ అక్రమాలు, కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్‌సీఎల్ పరిశ్రమలకు బ్లాక్‌ల కేటాయింపులపై సందేహాలు ఉన్నాయని తెలిపారు.

అన్ని అనుమతుల తర్వాతే మళ్లీ వేలం నిర్వహించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ సీఎంకు లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్‌కు కూడా పంపారు.

Tags:    

Similar News