CPI State Secretary, Kothagudem MLA Kunanneni Sambasiva Rao: పొత్తు కొనసాగాలంటే.. కాంగ్రెస్ వైఖరే కీలకం!

కాంగ్రెస్ వైఖరే కీలకం!

Update: 2026-02-18 04:49 GMT

CPI State Secretary, Kothagudem MLA Kunanneni Sambasiva Rao: కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడిన తొలి ఎన్నికల్లోనే సీపీఐ అసాధారణ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా తమ బలాన్ని చాటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

తొలి మేయర్‌గా కమ్యూనిస్టు నాయకుడు, అందులోనూ ఆటో డ్రైవర్ నేపథ్యం నుంచి ఎదిగిన వ్యక్తి ఎన్నిక కావడంపై సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీనియర్ నేతలు పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, ఈటీ నర్సింహ, పశ్య పద్మతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐని మరింత విస్తరించాలని, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను సవాలుగా తీసుకుంటామని కూనంనేని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తామన్నారు. రానున్న మూడేళ్లలో పొత్తు కొనసాగుతుందా లేదా అనేది పూర్తిగా కాంగ్రెస్ వైఖరిపై ఆధారపడి ఉంటుందని వివరించారు.

కొత్తగూడెంలో కాంగ్రెస్ పొత్తు తిరస్కరించడంతో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించామని, ఫలితాలు వచ్చాక భారాస మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మద్దతిస్తామని ముందుకొచ్చిందని గుర్తుచేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ చొరవతో పొత్తు కొనసాగించారని తెలిపారు. జిల్లాస్థాయిలో కాంగ్రెస్ అనేక ఇబ్బందులు కలిగించినా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కలిసి వచ్చామని కూనంనేని వ్యాఖ్యానించారు.

ఈ విజయం సీపీఐ బలానికి నిదర్శనమని, భవిష్యత్ ఎన్నికల్లో మరింత బలంగా ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News