Deputy CM Mallu Bhatti Vikramarka: అభివృద్ధి పథకాలపై త్వరలో ఇంటింటి ప్రచారం: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
Deputy CM Mallu Bhatti Vikramarka: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకం అమలులోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాన్ని తిప్పికొట్టేందుకు అభివృద్ధి సాధనలపై త్వరలో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా), ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన ఛైర్మన్‌లుగా నియమితులైన పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్ బాబాల అభినందన సభ ఆదివారం ఖమ్మం నగరంలోని పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ కండువా వేసుకుని గెలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియలు తమతోనే ఉన్నారని, వారందరికీ పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జెండాలు మోసే కార్యకర్తలెవరూ కాంగ్రెస్‌ను వీడలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఈ విద్యా సంవత్సరం నుంచే అందించనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మక్కలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ లాంటి మంచి వ్యక్తికి సముచిత స్థానం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు.
కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.