CM Revanth Reddy: సంక్షేమం - అభివృద్ధికి సమాన ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనంతటి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని వివరించారు. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
‘ప్రజా సమస్యలే మా లక్ష్యం’
తెలంగాణ కలను సాకారం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హితం కోసం పని చేస్తున్నామని చెప్పారు.
“మా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం. గత 30 నెలల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మేము సాధించిన విజయాలు గర్వకారణం. తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా వేగంగా ముందుకు వెళ్తున్నాం. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం” అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉద్యోగాలు, విద్య, ఇళ్లు... కీలక పథకాలు
న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా 67 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీ, టౌన్‌ప్లానింగ్, విద్యా శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయన్నారు.
1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో బ్రేక్‌ఫాస్ట్, జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రకటించారు.
పేదలకు సొంతి ఇళ్లు అందించడం మా ప్రభుత్వ ధ్యేయం. 13 నెలల్లో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం. రూ.22 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం.
పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు అందించామని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేశారు.