CM Revanth Reddy: తెలంగాణను బయో వరల్డ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ సంస్థలు భాగస్వాములవ్వాలి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రపంచ సంస్థలు భాగస్వాములవ్వాలి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బయో ఆసియా 2026 సదస్సు ప్రారంభం
CM Revanth Reddy: ఆసియా అత్యంత ప్రతిష్ఠాత్మక లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ ఫోరమ్ అయిన 'బయో ఆసియా 2026' సదస్సును ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సు 'టెక్ బయో అన్‌లీష్డ్: ఏఐ ఆటోమేషన్ - బయాలజీ రివల్యూషన్' థీమ్‌తో రెండు రోజుల పాటు జరుగుతోంది.
సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, "బయో ఆసియా తన పేరును అధిగమించి బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభ చూస్తుంటే తెలంగాణ బయో వరల్డ్‌గా ఎదుగుతుందని గర్వంగా చెప్పగలను. ప్రపంచవ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో టాప్ బిజినెస్ లీడర్లు, సైంటిస్టులు మనతో ఉన్నారు. సైన్స్, ఏఐ, బయోటెక్ రంగాల్లో కలిసి పనిచేస్తే అసాధారణ ఫలితాలు వస్తాయి" అని పేర్కొన్నారు.
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా మార్చేందుకు అందరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. "తెలంగాణ అంటే వ్యాపారం. అంతర్జాతీయ పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఈ సదస్సు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలా అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందనే నమ్మకం ఉంది" అని వివరించారు.
23 సంవత్సరాల క్రితం బయో ఆసియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్‌కు చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరంగా గుర్తింపు ఉండేదని, ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రముఖ విద్యాసంస్థలు ఈ విజయానికి కారణాలని చెప్పారు. గత రెండేళ్లలో జీవ విజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని, ఇటీవల దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకటించామని, 'వన్-బయో'ను ప్రారంభించామని, గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేస్తున్నామని వివరించారు.
ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్‌కు ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త లైఫ్ సైన్సెస్ సంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలు పాల్గొంటున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో జీవ విజ్ఞాన రంగం కీలకమని ఆయన ఉద్ఘాటించారు.
మా ప్రజా ప్రభుత్వం పెట్టుబడిదారులకు బాసటగా నిలుస్తుందని, విజయంలో భాగస్వాములవుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, పరిశోధన, డిజైన్‌లలో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు.