High Court: ఐలాపూర్‌ గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా (హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) విధి విధానాలు, మార్గదర్శకాలను కోర్టు ముందు సమర్పించే వరకు ఎలాంటి అనధికార నిర్మాణాలను కూల్చివేయకూడదని స్పష్టం చేసింది.

అయితే, జలాశయాలు, చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలు మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల చట్టం లేదా ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలు కోర్టు ముందు ఉంచకుండా అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు వంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశించింది.

అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ఎం.ఎ. షరీఫ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బి. విజయ్‌ సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపించారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్ల పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేస్తూ యుద్ధ స్థాయిలో చర్యలు చేపట్టడాన్ని సవాల్‌ చేశారు.

పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగించాలని, హైడ్రా విధి విధానాలు సమర్పించే వరకు కూల్చివేతలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tags: